శంషాబాద్​లో డ్రైవర్​ టికెట్ కొడుతుండగా అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

శంషాబాద్​లో డ్రైవర్​ టికెట్ కొడుతుండగా అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

 

  • ఇటుక లారీని ఢీకొని.. కంట్రోల్​కాక రివర్స్
  • బస్సులోని 20 మందికి గాయాలు
  • శంషాబాద్​ ఫ్లైఓవర్​పై ఘోర ప్రమాదం

శంషాబాద్, వెలుగు: కర్ణాటకలోని రాయచూర్​నుంచి సిటీకి వస్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు శంషాబాద్​లో అదుపు తప్పి, ముందు వెళ్తున్న ఇటుక లారీని ఢీకొట్టింది. బస్సులోని దాదాపు 20 మంది గాయపడ్డారు. ఓ వ్యక్తి కాలు విరిగింది. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. శుక్రవారం ఉదయం రాయచూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన హైదరాబాద్ డిపో ఎక్స్​ప్రెస్​బస్సు(టీఎస్ 09 జెడ్9065) శంషాబాద్​వరకు బాగానే వచ్చింది. అక్కడి ఫ్లైఓవర్​పైకి ఎక్కుతున్న టైంలో డ్రైవర్ స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోయాడు.

ముందు వెళ్తున్న ఇటుక లారీని ఢీకొట్టాడు. రోడ్డు మధ్యలోని డివైర్​ఎక్కి లారీ ఆగిపోగా, ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఫ్లైఓవర్​పైనే కొద్దిదూరం రివర్స్​వెళ్లి సైడ్​వాల్(సేఫ్టీ ర్యాంప్)ను ఢీకొని ఆగింది.  బస్సులోని 20 మంది గాయపడ్డారు. డ్రైవర్​వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి కాలు విరిగింది. వారందరిని పోలీసులు సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మిగిలిన వారిని ఇతర బస్సుల్లో పంపించారు. కాగా, ఫ్లైవర్​ఎక్కుతున్న టైంలో డ్రైవర్​ఓ ప్రయాణికుడికి టికెట్ కొట్టేందుకు ప్రయత్నించగా బస్సు అదుపు తప్పినట్లు ప్రయాణికులు తెలిపారు. కండక్టర్​లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. సైడ్​వాల్​ఢీకొని ఆగకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదని వాపోయారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.